*ఒద్దికగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని నేర్చుకోవోయ్
ఓ రాక్షస రాజకుమారా”!!
*బహుశా మాట పట్టింపు ఏదో వచ్చే ఉంటది!!
*ఓయ్.!ఆరుజన్మల నుంచి కాస్తంత పరిచయమే కదా!
ప్రేమ కవితల కవయిత్రి “ఆర్.రమాదేవి” మరో ప్రేమ కవిత ఇది..నిజానికిది కవిత రూపంలో.. వున్న ఓ ప్రేమ కథ..జన్మ జన్మల కథ.. ఈరోజు
కాఫీటైమ్లో ఈ “కథ” కమామీషు ఎందో చూద్దాం!
“అప్పుడప్పుడు
పనిగట్టుకొని పలకరించడానికి వస్తాడు
ఎన్నోమార్లు చెప్పిన తేనె పలుకుల్లా
కాసిన్ని వర్షపు చినుకులు కురిపిస్తాడు
అయినా కరుకు మాటలై తగులుతాయి
ఏమో మరి
నాకు చెప్పడానికి మాటలేమీ మిగలలేదేమో
మౌనంలో మాటలన్నీ వినడం వచ్చిందేమో
అయినా
ప్రేమించడం మొదలెట్టి చాలాకాలం అయ్యిందిగా తిరకాసు లెక్కలు తారుమారయ్యాయేమో
కాలంతో పాటుగా
నీడలు రెండుగా విడిపోయాయేమో
విడివడిన నీడలు కలహించుకుంటున్నాయేమో
బహుశా
మాట పట్టింపు ఏదో వచ్చే ఉంటది
వదిలి పొమ్మన్నా పోనీ అహం ఒకటి చేరే ఉంటది
ఏదైతేనేం
కాలం మలుపులతో పని లేదు నాకు
ఓయ్..,.
ఆరుజన్మల నుంచి కాస్తంత పరిచయమే కదా
నాతో వాదనలు సరికాదని బహు బాగా తెలుసు కదా
దారితప్పిన
పొడిబారిన మాటలిటు జాలువారకుండా
మెత్తగా మాటలకు తేనెలద్దడం
ఒద్దికగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని నేర్చుకోవోయ్ రాక్షస రాజకుమారా”!!
ఈ కవితలో…అదేనండీ కథలో ఓ రాజకుమారుడు.ఓ రాజకుమరి..మన మాటల్లో చెప్పాలంటే ఓ ప్రేయసీ, ఓ ప్రియుడు.ఇద్దరూ ప్రేమించుకున్నారు.
అలాంటిలాంటి ప్రేమకాదండోయ్..జన్మ జన్మల ప్రేమ..ఒకటా! రెండా మొత్తం ఆరు జన్మల ప్రేమ..ఇది ఏడో జన్మ..మనుషులకు ఏడు
జన్మలుంటాయంటారు..ఇతరులకైతే ఏమో గానీ.ప్రేమికుల కైతే మాత్రం ఏడు జన్మలూ తప్పని సరి.అలాగేఈ ప్రేమికులకూ ఇది ఏడో జన్మ.చివరి జన్మ…!
మరి వీళ్ళ జన్మ జన్మల ప్రేమ ఏమైనట్టు? అలా అలా కొన ‘సా గు ‘ తూనే వుంది.
అందరి ప్రేమలో మాదిరిగానే పదనిసలు వీరి ప్రేమలో కూడా వున్నాయి.కోపాలు..తాపాలు.
అలకలు..అరుపులు..అన్నీ వున్నాయి.అసలువన్నీ లేకుంటే అది ప్రేమేకాదు..చప్పగా వుండే
ది ప్రేమ ఎలా అవుతుంది? వీళ్ళ ప్రేమ మాత్రం ఫుల్ ప్యాకేజీతో నవరసాల మసాలాతో కలగలిసే
వుంది.లేకుంటే అతగాడిపై చిరుకోపం,అలక, నిష్ఠూరాలెందుకుంటాయి?
*ఇలా మొదలవుతుంది ...ఈ ప్రేమకథ
అప్పుడప్పుడు అతగాడు పనిగట్టుకొని,ఆమెను పలకరించడానికి వస్తాడుఎప్పటిలాగే
తేనెపలుకుల్లా.. కాసిన్ని వర్షపు చినుకులు కురిపిస్తాడు. అయినా,అందులో కొన్ని
కరుకు మాటలై తగులుతాయి. అతగాడి కరుకుమాటలు ఆమెకు గుచ్చుకుంటాయి.
ఇక ఆమె దగ్గర చెప్పడానికి మాటలేమీ ..లేవు..ఆమె మౌనం వహిస్తుంది ..అలా మౌనంలో
మాటలన్నీ వినడం ఆమెకు కొత్తేం కాదులెండి..అయినాప్రేమించడం మొదలెట్టి
చాలాకాలమే… అయ్యింది..ఈ తిరకాసు లెక్కలు తారుమారు…కావడం కూడా కొత్తకాదు..
ఆమెకిది అలవాటుగా మారింది.
కాలంతో పాటు వారిద్దరి నీడలు రెండుగా విడిపో
యాయాయి..విడివడిన నీడలు కలహించు కుంటున్నట్టుంది.
ఇంతకూ ఈ తకరారుకు కారణం ఏమైవుంటుందనేగా మీ అనుమానం.
బహుశా మాట పట్టింపు ఏదో వచ్చి ఉండొచ్చు..వదిలి పొమ్మన్నా పోనీ
అహం చేరి ఉండొచ్చు..ఇదంతా కాలం మలుపుల్లో జరిగే ప్రేమ తతంగమే..
ఏదైతేనేం గానీ, ఆమెకు కాలం మలుపులతో పని లేదు..అందుకే మౌనంవీడింది.
ఇద్దరి మధ్యనిశ్శబ్దపు తెరను తొలిగించి..నోరు తెరిచింది…
“ఓయ్..!
ఆరుజన్మల నుంచి మనం పరిచయమే కదా!
నాతో వాదనలు సరికాదని నీకు బహు బాగా తెలుసు కదా!
మరిప్పుడిదేంటి? కాస్త జాగ్రత్తగా వుండరాదా ! స్వామీ..
దారితప్పిన,పొడిబారిన మాటలిలా జాలు..వారకుండా మెత్తగా… మాటలకు తేనెలద్దడం
కాస్తంత ఒద్దికగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మరీ నేర్చుకోవోయ్! నా రాక్షస రాజకుమారా”!!
అంటుందామె…
ప్రేమలో వీరమే కాదు.. అప్పుడప్పుడు రాక్షసత్వం(కరుకుదనం)చూపడం మగాళ్ళకు…
అలవాటే కదా! అందుకే అతగాడిని “రాక్షస రాజకుమార! అని సంబోధించిందామె..
అవును…
ఆ ప్రేమ రాజ్యానికి.
వారిద్దరూ..రాజు,రాణి..వారి ప్రేమ అమరం.!!
ఇదండీ ఈ ప్రేమ కథ..కమామీషు..
*ఎ.రజాహుస్సేన్..!!
Text